ఇరాన్‌పై వచ్చేవారం దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వైమానిక దాడులు ఉద్ధృతం చేస్తామని కాట్జ్ తెలిపినట్లుగా ఇజ్రాయెల్ పత్రిక ఒకటి తెలిపింది. ఇరాన్ పాలకులు, ఆ దేశానికి ఆదాయవనరుగా ఉన్న మౌలిక సదుపాయాలపై తమ రెండు దేశాలు జరిపే దాడులు మరింత పెరుగుతాయని అన్నారు.
ఈ యుద్ధం లక్ష్యాలను సాధించేవరకు ఆపేది లేదని కాట్జ్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రతకు, అమెరికా ప్రయోజనాలకు పొంచి ఉన్న ముప్పు తొలగిపోయే వరకు ఆ దేశ పాలనా యంత్రాంగం, కమాండర్లు, వ్యూహాత్మక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేశారు.
ఇరాన్‌పై క్రమంగా సైనిక చర్యను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ మంత్రి నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇరాన్ నుంచి అణుముప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం, ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛను కల్పించడమే తమ ముందున్న లక్ష్యాలని అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ అన్నారు.








