ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొండంత అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం సరికొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు, ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే సంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం నిరుద్యోగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ఆ దుస్థితిని మార్చేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 6,28,347 ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు మంత్రి గర్వంగా ప్రకటించారు. ఇందులో 30,607 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తయిందని, తాజాగా విడుదల చేసిన క్యాలెండర్ ద్వారా మరో 10,060 పోస్టులను భర్తీ చేయనున్నామని వెల్లడించారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల ద్వారా 2.5 లక్షల మందికి, ఐటీ మరియు పర్యాటక రంగాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా మొత్తం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.
ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమ రంగంలోనూ తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, వారి పెన్షన్‌ను రూ. 3,000 నుండి రూ. 6,000కు పెంచిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. రంజాన్ తోఫా కింద ముస్లింల ఖాతాల్లో రూ. 45 కోట్లు జమ చేశామని, పోలవరం నిర్వాసితులకు రూ. 1,943 కోట్ల పరిహారం అందించామని చెబుతూ, తమది చేతల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.








