ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 98వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో గల డాల్బీ థియేటర్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం ఆస్కార్ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (పాల్ థామస్ అండర్సన్), ఉత్తమ ఎడిటింగ్ మరియు ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే వంటి కీలక విభాగాల్లో ఈ సినిమా అవార్డులను కొల్లగొట్టింది. హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ అలరించారు.
ఈసారి ఆస్కార్ అవార్డుల వేడుకలో కొన్ని ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. గతంలో 23 విభాగాల్లో అవార్డులు ఇచ్చేవారు కాగా, ఈ ఏడాది కొత్తగా ‘బెస్ట్ కాస్టింగ్’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ తొలి అవార్డును కూడా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ దక్కించుకోవడం విశేషం. నటన విభాగంలో ‘సిన్నర్స్’ చిత్రానికి గానూ మైఖేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడిగా నిలవగా, ‘హామ్నెట్’ చిత్రంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. భారతీయ నటి ప్రియాంక చోప్రా ఈ వేదికపై ఒక విభాగానికి అవార్డును అందజేసి సందడి చేశారు.
సాంకేతిక విభాగాల్లో కూడా గట్టి పోటీ నెలకొంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ తన సత్తా చాటగా, ‘ఫ్రాంకెన్ స్టైయిన్’ చిత్రం ఉత్తమ మేకప్, కాస్ట్యూమ్ డిజైన్ మరియు ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘కేపాప్ డిమాన్ హంటర్స్’ విజేతగా నిలిచింది. నార్వేకు చెందిన ‘సెంటిమెంటల్ వ్యాల్యూ’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలవగా, పుతిన్ వ్యతిరేక పోరాటంపై తీసిన ‘మిస్టర్.. నోబడీ ఎగనెస్ట్ పుతిన్’ ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైంది.








