పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న తరుణంలో ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జల సంధిని ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. అమెరికా మరియు ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించడానికి వీల్లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఒకవేళ తమ అనుమతి లేకుండా ఈ జల సంధిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి హెచ్చరించారు.
ఇరాన్ సాయుధ దళాలు ప్రస్తుతం ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని పర్యవేక్షిస్తున్నాయి. తమ దేశంపై దాడులు చేయడానికి హర్మూజ్‌ను ఏ దేశమూ వాడుకోకుండా అడ్డుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, అమెరికా మరియు ఇజ్రాయెల్ మినహా మిగిలిన దేశాల ట్యాంకర్లకు అనుమతి ఇస్తామని ప్రకటించినప్పటికీ, అందుకు పలు కఠినమైన షరతులను పాటించాలని తేల్చి చెప్పింది. ప్రాంతీయ భద్రత దృష్ట్యా ఈ చర్యలు తప్పవని, తమ జాతీయ భద్రతను కాపాడుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ పేర్కొంది.
మరోవైపు, హర్మూజ్ జల సంధిలో భద్రత కోసం యుద్ధ నౌకలను పంపాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థనను ఆస్ట్రేలియా, జపాన్ వంటి మిత్రదేశాలు తిరస్కరించడం గమనార్హం. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం కావడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌లోని ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండగా, అక్కడ గత 17 రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఈ పరిణామాలు ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








