టీఎస్పీఎస్సీలో లీక్ అయిన పేపర్లు 15 అని,రద్దు అయిన పరీక్షలు6 అని..రోడ్డున పడ్డది 10 లక్షల మంది నిరుద్యోగులు అని..దీనంతటికీ కారణం ఇద్దరేనని..చిన్నదొర,మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్ బృందం తేల్చిన రిపోర్టు అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గతంలో డ్రగ్స్ కేసు,ఎమ్మెల్యేల కొనుగోలు కేసులానే.. పేపర్ లీక్ కుంభకోణాన్ని సిట్ నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
ఒక్క పేపర్ లీక్ అయితేనే ఆ విషయం తొందరగా బయటకు వస్తుందని.. కానీ పదిహేను పేపర్లు లీక్ అయ్యే వరకూ బయటకు రాలేదంటే.. దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం లేదంటారా అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ సర్వర్ నుంచి పేపర్ లీక్ అయితే… ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రమేయం లేదంటారా అని ప్రశ్నించారు.
ఇంత జరిగినా బోర్డును ప్రక్షాళన చేయలేదంటే ఇంకా కొలువులు అమ్ముకునే ఉద్దేశం మీకుందా? అని నిలదీశారు. నిర్దోషులైతే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నారని అడిగారు. కొలువులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి పట్టింపులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల గోస పట్టదని.. నిరుద్యోగుల కోసమే టీ సేవ్ ఏర్పడిరదని తెలిపారు.విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకూ పార్టీలకు అతీతంగా టీ సేవ్ పోరాడుతుందని చెప్పారు.