ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని భారత్ మరియు ఏపీ భవిష్యత్ గమనాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ నాలెడ్జ్ ఎకానమీలో భారత్ అగ్రగామిగా ఉందని, ప్రపంచంలోని 60 శాతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఇక్కడే ఏర్పాటు కావడం మన ప్రతిభకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. యూపీఐ వంటి డిజిటల్ సంస్కరణలు దేశ ముఖచిత్రాన్ని మార్చేశాయని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వంటి పరిణామాలు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి చిహ్నాలని గుర్తు చేశారు.
అమరావతిని క్వాంటం వ్యాలీగా మరియు కాలుష్య రహిత బ్లూ-గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచ గతిని మార్చే గేమ్ చేంజర్ అని అభివర్ణిస్తూ, ఏపీలో ఏఐ ఆల్గారిథమ్స్ మరియు శిక్షణ కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో మేధావులు విదేశాలకు వెళ్లినా, ఇప్పుడు ‘రివర్స్ మైగ్రేషన్’ మొదలైందని, నిపుణులు ఉన్న చోటికే అవకాశాలు వస్తున్నాయని విశ్లేషించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ల ద్వారా భారత్ త్వరలోనే విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సదస్సులో జనాభా నిర్వహణపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. రాష్ట్రంలో ఏజింగ్ (వృద్ధాప్య) సమస్యను నివారించేందుకు జనాభా వృద్ధిని ప్రోత్సహిస్తున్నామని, ఫెర్టిలిటీ రేటును పెంచేలా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని రూపొందించామని వివరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్థిక సాయం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సహకార ఫెడరలిజం ద్వారా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.








