పంజాబ్‌లోని బర్నాలాలో ఒక వింతైన మరియు ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.50 పెట్టి లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన ఒక వ్యక్తికి రూ.30 లక్షల బంపర్ ప్రైజ్ తగిలింది. అయితే, ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియకపోవడంతో లాటరీ ఏజెంట్ ఇప్పుడు అతని కోసం గల్లీ గల్లీ తిరుగుతూ డప్పులు, మైకులతో చాటింపు వేయిస్తున్నారు. ఫిబ్రవరి 26న ప్రకటించిన నెలవారీ లాటరీ ఫలితాల్లో బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని ఏజెంట్ వద్ద విక్రయించిన టిక్కెట్‌కు ఈ బహుమతి లభించింది.
సాధారణంగా లాటరీ టిక్కెట్లపై కొనుగోలుదారుడి పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు ఉండవు. దీనివల్ల విజేత ఎవరో గుర్తించడం ఏజెంట్‌కు కష్టతరంగా మారింది. నియమ నిబంధనల ప్రకారం, విజేతను ప్రకటించిన నెల రోజుల్లోగా సదరు వ్యక్తి వచ్చి తన ప్రైజ్ మనీని క్లెయిమ్ చేసుకోకపోతే, ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అందుకే సకాలంలో విజేతను కనిపెట్టాలని ఏజెంట్ ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.
విజేత వస్తే ఘనంగా స్వాగతం పలికేందుకు ఏజెంట్ తన ప్రాంగణాన్ని బెలూన్లతో అందంగా అలంకరించారు. ఇప్పటికే ఏజెంట్‌కు తన కమీషన్ కింద రూ.1 లక్ష అందాయి. అయితే అసలు విజేత ఆచూకీ ఇంకా లభించకపోవడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. అదృష్టం తలుపు తట్టినా ఆ వ్యక్తికి ఇంకా విషయం తెలియకపోవడం గమనార్హం.








