భారత గడ్డపై ఒక విదేశీ అధికారి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ భారత్ పర్యటనలో చేసిన ప్రకటనలు దేశ సార్వభౌమాధికారాన్ని.. భవిష్యత్తు ఆర్థిక వృద్ధిని ప్రశ్నిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. “చైనా విషయంలో 20 ఏళ్ల క్రితం చేసిన తప్పులను మళ్లీ చేయబోమని.. భవిష్యత్తులో భారత్ తమతో పోటీ పడే స్థాయికి ఎదగకుండా అడ్డుకుంటాం” అని ఆయన పేర్కొన్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత మార్కెట్ తమకు దీటుగా ఎదగకుండా నియంత్రిస్తామనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం సంచలనంగా మారింది.
ఒక విదేశీ దౌత్యవేత్త భారత గడ్డపై నిలబడి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, మన దేశ నాయకత్వ బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 20 ఏళ్ల క్రితం చైనాకు ఇచ్చిన అవకాశాలను భారత్‌కు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేయడం ద్వారా మన దేశ ఆర్థిక ఎదుగుదలను అడ్డుకోవాలనే కుట్రను అమెరికా బహిరంగంగానే ప్రకటించుకుందని విమర్శలు వస్తున్నాయి. ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు వెలువడినా దేశ ప్రధాని మౌనం వహించడం శోచనీయమని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. విదేశీ శక్తులు భారత అంతర్గత.. ఆర్థిక వ్యవహారాల్లో ఇంతగా జోక్యం చేసుకుంటుంటే నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీలోని ప్రస్తుత నాయకత్వం దేశ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమవుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. విదేశీ ప్రతినిధులు భారత్ వచ్చి మనల్ని శాసించే స్థాయికి వెళ్లడం ఆందోళనకరమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒక స్వతంత్ర దేశంగా భారత్ తన మార్కెట్‌ను.. ఆర్థిక వ్యవస్థను విస్తరించుకునే హక్కును అమెరికా ఎలా ప్రశ్నిస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది కేవలం దౌత్యపరమైన వైఫల్యం మాత్రమే కాదని.. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ కోరాలని డిమాండ్ చేస్తున్నారు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న తరుణంలో.. అమెరికా అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు మన దేశ అభివృద్ధిని అణగదొక్కేలా ఉన్నాయని స్పష్టమవుతోంది. “భారత్ తమతో పోటీ పడకుండా చూస్తాం” అనడం దౌత్య సంబంధాలకు విఘాతం కలిగించడమేనని మేధావులు పేర్కొంటున్నారు. ఇటువంటి సున్నితమైన అంశంపై ప్రభుత్వం మౌనం వహిస్తే భవిష్యత్తులో మరిన్ని విదేశీ శక్తులు భారత్ పట్ల చులకన భావంతో వ్యవహరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దేశ గౌరవాన్ని.. ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం దృఢంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని సర్వత్రా వినిపిస్తోంది.









