AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడు జర్దారీ సంచలన ఆరోపణలు..

భారత్ తమపై మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. సరిహద్దుల్లో భారత సైనిక కదలికలు భారీగా పెరిగాయని, ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు.

 

సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగడాన్ని జర్దారీ తీవ్రంగా తప్పుబట్టారు. దీన్ని ఆయన ‘జల ఉగ్రవాదం’ (హైడ్రో టెర్రరిజం)గా అభివర్ణించారు. “భారత్ నీటిని ఒక ఆయుధంగా మార్చి, పాకిస్థాన్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే” అని ఆయన ఆరోపించారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించనంత వరకు దక్షిణాసియాలో శాంతి ఒక కలగానే మిగిలిపోతుందని జర్దారీ పునరుద్ఘాటించారు. యుద్ధ క్షేత్రం నుంచి వైదొలగి, చర్చల వేదికపైకి రావాలని భారత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ఇదే సమయంలో, అఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి కూడా జర్దారీ హెచ్చరికలు జారీ చేశారు. పాక్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలను అణచివేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే సరిహద్దుల్లో ‘ఘజబ్ లిల్ హక్’ పేరుతో సైనిక ఆపరేషన్ కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు.

 

అయితే, పాకిస్థాన్ ఆరోపణలను భారత్ మొదటి నుంచీ ఖండిస్తోంది. సీమాంతర ఉగ్రవాదం ఆగే వరకు ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని న్యూఢిల్లీ తేల్చిచెప్పింది. గతేడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఉగ్రవాదాన్ని అరికట్టే వ్యూహాత్మక ఒత్తిడిలో భాగంగానే సింధు జలాల ఒప్పందంపై భారత్ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ANN TOP 10