పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడూ శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉంటుందని, ఎలాంటి వివాదాలకైనా దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలన్నది మన దేశ చిరకాల విధానమని ఆయన గుర్తుచేశారు. యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించాలని కోరారు.
ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మోదీ తెలిపారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భారత పౌరుల క్షేమం కోసం ఆయా దేశాల ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.








