ఇరాన్ మరియు అమెరికా మధ్య అణు ఒప్పందంపై జెనీవాలో జరిగిన రెండో విడత చర్చలు ఎటువంటి పురోగతి లేకుండా కేవలం మూడు గంటల్లోనే ముగిశాయి. ఈ చర్చల ప్రతిష్టంభన తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన యుద్ధ నౌకలను పశ్చిమాసియా దిశగా పంపుతున్నట్లు ప్రకటించగా, ఇరాన్ దానికి ప్రతిస్పందనగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసింది. అంతేకాకుండా, తన తీర ప్రాంతంలో భారీ క్షిపణి విన్యాసాలను నిర్వహిస్తూ తన సైనిక శక్తిని ప్రదర్శించింది.
ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ సామాజిక మాధ్యమాల వేదికగా అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా యుద్ధ నౌకలు ప్రమాదకరమే కావచ్చు కానీ, వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యం గల ఇరాన్ ఆయుధాలు అంతకంటే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహామ్ లింకన్ ప్రస్తుతం ఇరాన్ తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూలదోయడానికి అమెరికా గత 47 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని ఖమేనీ స్పష్టం చేశారు.
హర్మూజ్ జలసంధి మూసివేత నిర్ణయం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల నుంచి చమురు రవాణా నిలిచిపోయి, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. తనను లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్‌ను మ్యాప్ నుంచి తుడిచిపెట్టేస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించిన నేపథ్యంలో, ఇరాన్ తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తోంది.








