ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 34వ నిందితుడిగా ఉన్న టీటీడీ డైరీ ఎగ్జిక్యూటివ్ విజయభాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ (ACB) కోర్టు కొట్టివేసింది. విచారణలో భాగంగా విజయభాస్కర్ రెడ్డి భారీగా లంచాలు తీసుకున్నట్లు అంగీకరించడంతో పాటు సిట్ (SIT) సేకరించిన కీలక ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
సిట్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీల పనితీరు సరిగా లేకపోయినప్పటికీ, విజయభాస్కర్ రెడ్డి వారికి అనుకూలంగా నివేదికలు ఇచ్చారని ప్రాసిక్యూషన్ నిరూపించింది. సదరు కంపెనీలు సరఫరా చేసే నెయ్యి నాణ్యతగా ఉందని తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి, టీటీడీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు వివరించారు. ఈ అక్రమాల వల్ల 2019 నుండి 2024 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు 118 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సిట్ తన నివేదికలో పేర్కొంది.
Advertisement
విజయభాస్కర్ రెడ్డి వివిధ కంపెనీల నుండి భారీ మొత్తంలో లంచాలు స్వీకరించినట్లు విచారణలో తేలింది. భోలే బాబా కంపెనీ నుంచి 2023లో ఈ సంస్థ నుండి రూ. 75 లక్షల లంచం, ప్రీమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షల నగదు లంచం, 8 గ్రాముల బంగారం లంచంగా తీసుకున్నారు. ఈ నగదు మొత్తాన్ని నేరుగా కాకుండా హవాలా మార్గంలో అందుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే విజయభాస్కర్ రెడ్డి నుండి 34 లక్షల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం కోట్ల మంది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న లడ్డు ప్రసాదం నాణ్యతను తాకట్టు పెట్టారని ప్రాసిక్యూషన్ వాదించింది.
నిందితుడు విజయభాస్కర్ రెడ్డి స్వయంగా తాను లంచం తీసుకున్నట్లు సిట్ విచారణలో అంగీకరించడం, ప్రాథమిక ఆధారాలు బలంగా ఉండటంతో ఏసీబీ కోర్టు ఆయన బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ మరింత లోతుగా జరిగే అవకాశం ఉందని ఈ కుంభకోణంలో మరికొందరు కీలక వ్యక్తుల హస్తం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.









