AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రయాగ్‌రాజ్‌లో మాఘ మేళా ప్రారంభం: కుంభమేళాకు, దీనికి ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే!

ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం వద్ద ఏటా నిర్వహించే మాఘ మేళా ఆధ్యాత్మిక శోభతో మొదలైంది. జనవరి 3న పౌష పూర్ణిమ పుణ్యస్నానంతో ప్రారంభమైన ఈ ఉత్సవం, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి వరకు మొత్తం 44 రోజుల పాటు కొనసాగుతుంది. తొలి రోజే సుమారు 21.5 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడం విశేషం. గతేడాది జరిగిన మహా కుంభమేళాతో పోలిస్తే రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ, భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం 800 హెక్టార్ల మేళా ప్రాంతాన్ని 7 సెకార్లుగా విభజించి, భారీ భద్రతను మరియు 3800 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

మాఘ మేళాకు, కుంభమేళాకు ఉన్న ప్రధాన వ్యత్యాసాలను గమనిస్తే.. కుంభమేళా అనేది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి (మహా కుంభమేళా) లేదా 6 ఏళ్లకు ఒకసారి (అర్ధ కుంభమేళా) అత్యంత భారీ స్థాయిలో జరుగుతుంది. దీనికి భిన్నంగా, మాఘ మేళా ప్రతి సంవత్సరం మాఘ మాసంలో ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. కుంభమేళాలో ఉండే సాధువుల సమాగమం, ఆధ్యాత్మిక చర్చలు, దానధర్మాలు అన్నీ మాఘ మేళాలోనూ కనిపిస్తాయి. అయితే కుంభమేళా అనేది దేశంలోని నాలుగు ప్రాంతాలలో (ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్) మారుతూ జరుగుతుండగా, మాఘ మేళా మాత్రం కేవలం ప్రయాగ్‌రాజ్ సంగమ తీరానికే పరిమితం.

ఈ 44 రోజుల ఉత్సవంలో ఆరు ప్రధాన స్నాన దినాలు అత్యంత పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 18), వసంత పంచమి (జనవరి 23), మాఘీ పూర్ణిమ (ఫిబ్రవరి 1) మరియు ముగింపు రోజైన మహాశివరాత్రి (ఫిబ్రవరి 15)న భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సంగమ స్నానాలు ఆచరిస్తారు. పర్యావరణ పరిరక్షణ మరియు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మేళా ప్రాంగణంలోనే ప్రత్యేక ఆసుపత్రులు మరియు 400 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ANN TOP 10