AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భాషా ఉన్మాదం: మరాఠీ మాట్లాడటం లేదని ఆరేళ్ల కూతురిని చంపిన తల్లి.. నవీ ముంబైలో ఘోరం!

నవీ ముంబైలోని కలాంబోలి ప్రాంతంలో నివసించే ఒక విద్యావంతురాలైన మహిళ, తన ఆరేళ్ల కూతురు మరాఠీ భాష సరిగా మాట్లాడటం లేదనే కారణంతో గొంతు నులిమి హత్య చేసింది. నిందితురాలు బీఎస్సీ చదివిన పట్టభద్రురాలు కాగా, ఆమె భర్త ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2019లో జన్మించిన ఈ చిన్నారికి చిన్నప్పటి నుంచి మాటలు సరిగా రాకపోవడంతో పాటు, ఎక్కువగా హిందీ పదాలను ఉపయోగిస్తుండేది. ఈ విషయంలో తీవ్ర అసహనానికి గురైన తల్లి, “సరిగా మాట్లాడని ఇలాంటి కూతురు నాకు వద్దు” అని భర్తతో తరచూ గొడవ పడేది.

డిసెంబర్ 23 రాత్రి ఈ దారుణం జరిగింది. చిన్నారిని గొంతు నులిమి చంపేసిన అనంతరం, ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. పాప స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, చిన్నారి వయసు దృష్ట్యా గుండెపోటు అనే కారణంపై అనుమానం కలిగిన కలాంబోలి సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కోటే, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించారు.

పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. చిన్నారి శ్వాస ఆడకపోవడం (Asphyxiation) వల్లే మరణించిందని తేలడంతో పోలీసులు తల్లిదండ్రులను విచారించారు. సుమారు ఆరు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత, తానే కూతురిని హత్య చేసినట్లు ఆ తల్లి అంగీకరించింది. నిందితురాలు కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటన భాషాభిమానం మూర్ఖత్వంగా మారితే ఎంతటి ప్రమాదకరమోనని నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.

ANN TOP 10