హీరోయిన్ల వస్త్రధారణ విషయంలో తాను చేసిన కామెంట్స్ ఒక వ్యక్తిని ఉద్దేశించినవి కావని శివాజీ స్పష్టం చేశారు. సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి సీనియర్ యాంకర్లు ఎంతో గౌరవప్రదమైన దుస్తులు వేసుకుంటారని, వారిని చూసి నేర్చుకోవాలని మాత్రమే తాను అన్నట్లు తెలిపారు. “ఈ విషయంలోకి యాంకర్ అనసూయ ఎందుకు వచ్చారు? ఆమె పేరును నేను ఎక్కడా ప్రస్తావించలేదు కదా! మిమ్మల్ని అనాల్సిన అవసరం నాకేముంది?” అని ఆయన ప్రశ్నించారు. కేవలం తన మాటలను కొందరు ట్యాగ్ చేయడం వల్లే ఆమె స్పందించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ వివాదంపై శివాజీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, తాను వాడిన కొన్ని పదాలు తప్పని అంగీకరించారు. “నేను తప్పుగా మాట్లాడానని గ్రహించాక, మొదట నా భార్యకే క్షమాపణ చెప్పాను. ఆ తర్వాత వీడియో ద్వారా అందరికీ సారీ చెప్పాను” అని వెల్లడించారు. నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానుల ప్రవర్తన చూసి, ఆవేదనతోనే హీరోయిన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేశానని, కానీ వాటిని కొందరు కావాలనే పెద్దది చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై ఫిర్యాదులు చేసిన వారిపై కూడా శివాజీ మండిపడ్డారు. అందరూ మహిళా కమిషన్ కి, ప్రభుత్వం కి ఫిర్యాదులు చేశారు కానీ, ఎవరూ నేరుగా ఫోన్ చేసి “అలా ఎందుకు మాట్లాడావు?” అని అడగలేదని అన్నారు. ఒక్క సుప్రియ గారు మాత్రమే ఫోన్ చేశారని, ఆమెకు తాను క్షమాపణ చెప్పానని తెలిపారు. ఇంకా ఎవరికైనా క్షమాపణలు చెప్పాల్సి వస్తే సిద్ధమేనని, తన వల్ల తన కుటుంబం ఇబ్బంది పడకూడదన్నదే తన తాపత్రయమని శివాజీ పేర్కొన్నారు.








