ప్రముఖ నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నీలో ఆమె ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించి దేశ గౌరవాన్ని చాటారు. 50 ఏళ్ల వయసులోనూ కఠినమైన వర్కౌట్లు చేస్తూ ఫిట్నెస్ విషయంలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రగతి, తన విజయంతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ విజయం ఆమె నిరంతర కృషికి దక్కిన ఫలితమని క్రీడాభిమానులు ప్రశంసిస్తున్నారు.
అయితే, ప్రగతి సాధించిన ఈ పతకాల వెనుక తాను చేయించిన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై ప్రగతి తీవ్రంగా స్పందించారు. సుమారు రెండున్నరేళ్ల క్రితం తాను మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్నేహితుల సలహాతో ఆయన వద్ద పూజలు చేయించుకున్న మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. కానీ, ఎప్పుడో జరిగిన పూజలకు, ఇప్పుడు తన కష్టార్జితంతో వచ్చిన పతకాలకు ముడిపెట్టడం సరికాదని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.
తన విజయం కేవలం కఠిన సాధన మరియు క్రమశిక్షణ వల్ల మాత్రమే సాధ్యమైందని ప్రగతి స్పష్టం చేశారు. “నా విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడం వారి సంస్కారానికే వదిలేస్తున్నాను” అంటూ వేణు స్వామికి కౌంటర్ ఇచ్చారు. పూజల వల్ల తన జీవితంలో గానీ, క్రీడల్లో గానీ ఎలాంటి ప్రత్యక్ష మార్పు రాలేదని, కేవలం తన కృషినే తాను నమ్ముకున్నానని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ ‘క్రెడిట్ వార్’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.








