ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అహంకారంతో రెచ్చిపోతున్న దుండగుల పట్ల పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో ఏడు నెలల నిండు గర్భిణీ అని కూడా చూడకుండా ఆమె కడుపుపై తన్నిన వైసీపీ కార్యకర్త అజయ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో బాణసంచా కాలుస్తూ, పక్కకు వెళ్లి కాల్చుకోవాలని కోరిన సంధ్యారాణి అనే మహిళపై అజయ్ భౌతిక దాడికి దిగాడు. ఈ కిరాతక చర్యపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి మంగళవారం కదిరి పట్టణ వీధుల గుండా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి ఇది ఒక హెచ్చరిక అని పోలీసులు తేల్చి చెప్పారు.
కేవలం కదిరిలోనే కాకుండా అనంతపురం జిల్లాలోనూ పోలీసులు నిందితుల పట్ల ఇదే తరహాలో వ్యవహరించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా మూగజీవాలను బలి ఇచ్చి, వాటి రక్తంతో ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన బొమ్మగానిపల్లి సర్పంచ్ ఆదినారాయణరెడ్డి సహా ఇతర నిందితులకు కూడా పోలీసులు షాక్ ఇచ్చారు. బహిరంగంగా హింసను ప్రోత్సహిస్తూ, సమాజంలో భయాందోళనలు రేకెత్తించిన వీరిని కళ్యాణదుర్గం వీధుల్లో నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. నేరస్థుల్లో భయం కలిగించేందుకే ఈ విధమైన చర్యలు చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
మరోవైపు, నియోజకవర్గాల్లో ‘రప్పా రప్పా నరికేస్తాం’ అంటూ వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కొందరు పాఠశాల, కళాశాల విద్యార్థులపై పోలీసులు మానవత్వంతో స్పందించారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పోలీసులు వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే, రాజకీయ నేతల అండతో మహిళలపై, మూగజీవాలపై దాడులకు తెగబడే వారిని మాత్రం అస్సలు ఉపేక్షించేది లేదని ఏపీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల ఈ తీరు పట్ల సామాన్య ప్రజలు మరియు మహిళా సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.








