AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అక్రమ కేసులు పెడితే వదిలేది లేదు: పోలీసు అధికారులకు హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్!

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంతో ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పు కోసం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పేర్లను తాము ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. ఏపీలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అధికారులకు ప్రస్తుతం పట్టిన గతే, ఇక్కడి అధికారులకు కూడా పడుతుందని.. రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా చట్టం ముందు నిలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి, ప్రభుత్వం ముంబై బ్రోకర్ల సలహాలతో నడుస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని దేవుడిపై ఒట్టేసి చెప్పినా తనపై కేసులు పెడుతున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, రేసింగ్ వంటి పాత అంశాలను తెరపైకి తెస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అప్పుడే ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి ఓయూకు వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులు పెట్టినా మరింత ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాడుతామని హరీష్ రావు తేల్చి చెప్పారు.

ANN TOP 10