దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహాన్ని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ విగ్రహం 7.2 అడుగుల ఎత్తు ఉంది.
ఈ సందర్భంగా, బాలు విగ్రహావిష్కరణపై ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ స్పందించారు. రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలన్నది బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక అని ఆమె వెల్లడించారు. ఈ కోరికను ఆయన ఆర్కెస్ట్రా వారి వద్ద వ్యక్తం చేయగా, వారు వారించినప్పటికీ, ఇప్పుడు ఆయన కోరిక నెరవేరిందని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.
విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో ఆ రోజు సాయంత్రం 50 మందితో కూడిన సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. తెలుగును మరిచిపోవద్దని, క్రమశిక్షణగా ఉండాలని ఎస్పీ బాలు ఎప్పుడూ చెప్పేవారని ఎస్పీ శైలజ గుర్తు చేసుకున్నారు.









