ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు మరియు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో వైసీపీ ‘కోటి సంతకాల’ కార్యక్రమం కొంతసేపు నిలిచిపోయింది.
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రీకాకుళంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మాజీ మంత్రి అప్పలరాజు పలాస నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ వజ్రపుకొత్తూరు మండలం బెండి గేట్ వద్దకు చేరుకోగానే జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, మాజీ మంత్రి అప్పలరాజుకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్వరంతో మాట్లాడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని అప్పలరాజు ప్రశ్నించారు.









