తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండు, మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి పార్టీ పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే, మరో మూడేళ్లే సమయం ఉండటం, ఖాళీలను నాన్చడం సరికాదన్న రాష్ట్ర నేతల అభిప్రాయం మేరకు మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, కేవలం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తే ఆశావహుల్లో నిరాశ పెరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే, ముందుగా మంత్రివర్గంలో కొంత ప్రక్షాళన చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొందరికి రెండేళ్ల పాటు మంత్రిపదవి అవకాశం ఇచ్చినందున, వారిని తప్పించి, కొత్తగా ఆరుగురికి (ఖాళీగా ఉన్న రెండింటితో పాటు మరో నలుగురిని తప్పిస్తే) సామాజికవర్గం, ప్రాంతాల ప్రాతిపదికన అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపడితేనే రానున్న ఎన్నికలకు తన టీమ్‌ను సిద్ధం చేసుకోవాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా ఉంది. కానీ, ఎవరిని కేబినెట్ నుంచి తప్పించాలి (ఎవరు ‘అవుట్’), ఎవరిని తీసుకోవాలి (ఎవరు ‘ఇన్’) అనే విషయంపై హైకమాండ్ నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. ఈ నెల 17న మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో, విస్తరణ ఎప్పుడు జరుగుతుందో, హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆశావహులు ఢిల్లీ బాట పడుతున్నారు.









