తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రజలతో ముచ్చటించారు. సోమవారం సాయంత్రం ‘ఆస్క్ కవిత’ (#AskKavitha) పేరుతో ఆమె ఎక్స్ (X) లో నెటిజన్ల ప్రశ్నలకు, ఆలోచనలకు సమాధానాలిచ్చారు. ఈ సెషన్‌లో ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు ఆమె స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో (2029) తాను తప్పకుండా పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాజకీయాలకు సంబంధించి మరో ప్రశ్నగా, “మీ కొత్త పార్టీ పేరు ఏంటి?” అని ఒక నెటిజన్ అడగగా, ఆమె ‘ఎలా ఉండాలి’ అని బదులివ్వడం గమనార్హం. అంతేకాకుండా, తాను జాగృతిని మరింత బలోపేతం చేస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాలకు విస్తరిస్తానని ఆమె పేర్కొన్నారు.
తన రాజకీయ విజన్ మరియు మిషన్ గురించి కవిత వెల్లడిస్తూ, 2047 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా మరియు నాణ్యమైన విద్య (Free & Quality Education) మరియు ఆరోగ్య సంరక్షణ (Health Care) అందించడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విధంగా, కవిత తన రాజకీయ రంగంలో భవిష్యత్తు లక్ష్యాలను మరియు కార్యచరణను ఈ సెషన్ ద్వారా పంచుకున్నారు.









