తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిర్పూర్ (టి) మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ అభ్యర్థి, గెలిచిన బీజేపీ అభ్యర్థిపై దాడికి యత్నించడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీంతో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి భీంరావు, గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి తనుబాయి భర్త పోశెట్టిపై దాడికి ప్రయత్నించాడు. భీంరావు పబ్లిక్‌గా వేట కొడవలి పట్టుకుని రెచ్చిపోయాడు. అంతేకాకుండా, గెలిచిన సర్పంచ్‌ను చెట్టుకు కట్టేసి చంపుతానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. ఈ దాడి ప్రయత్నం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
గ్రామస్థులు వెంటనే అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు భారీ ఎత్తున బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు తమపై బరిలో నిలబడ్డ ప్రత్యర్థులపై దాడులు చేసిన ఘటనలు పలుచోట్ల వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ తాజా సంఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.









