ఏపీ రాజధాని అమరావతికి మణిహారంగా భావిస్తున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంపై మరో అప్ డేట్ వచ్చింది. అమరావతి ఓఆర్ఆర్ ఐదు జిల్లాల పరిధిలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల 3ఏ వివరాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాల 3ఏ వివరాలకు NHAI, రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపాయి.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం గుంటూరు, కృష్ణా, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో చేపడుతున్నారు. అన్ని జిల్లాల నుంచి 3ఏ ప్రతిపాదనలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వద్దకు చేరాయి. ఎన్టీఆర్ జిల్లా వివరాలు మినహా మిగతా నాలుగు జిల్లాల 3ఏ వివరాలకు ఆమోదం లభించి, గెజిట్ నోటిఫికేషన్ కూడా ప్రచురించారు.
ఎన్టీఆర్ జిల్లా వివరాలకు కూడా ఆమోదం లభిస్తే.. అభ్యంతరాలు తెలుసుకునేందుకు పత్రికా ప్రకటన జారీ చేస్తారు. సాధారణ ప్రజలు, ఆయా సర్వే నంబర్లలో ఉన్నవారి నుంచి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమయితే.. జేసీ విచారణ జరుపుతారు. అభ్యంతరాలు లేకపోతే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 190 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా నిర్మించనున్నారు, ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ.24,791 కోట్లుగా అంచనా వేశారు.









