తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, వెలువడిన ఫలితాల సరళిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. తొలి విడతలో మొత్తం 3,834 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలుపుకుని, కాంగ్రెస్ మద్దతుదారులు 776 మందికి పైగా విజయం సాధించగా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 312 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 63 మంది గెలుపొందారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడ తల్లి, కూతురు మధ్య పోటీ నెలకొంది. రిజర్వేషన్‌లో బీసీ మహిళకు కేటాయించిన ఈ స్థానంలో, తల్లి శివరాత్రి గంగవ్వను బీఆర్ఎస్ బలపరచగా, ఆమె కుమార్తె సుమలతను కాంగ్రెస్ బలపరిచింది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపులో కూతురు సుమలత తల్లి గంగవ్వపై 91 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మొదటి విడత ఎన్నికల్లో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, 3,834 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఉత్కంఠకు నిదర్శనంగా, యాదాద్రి జిల్లాలోని లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో లాటరీ తీయగా, డ్రాలో బీఆర్ఎస్ మద్దతుదారు ఇండ్ల రాజయ్య విజయం సాధించారు.









