హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో భూములకు మరోసారి కోట్లాది రూపాయల ధర పలికింది. కోకాపేటలోని నియోపొలిస్ భూములకు సంబంధించి నిర్వహించిన మూడో విడత వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ వేలంలో ఫ్లాట్ నెంబర్ 19లో ఉన్న ఎకరా భూమి ఏకంగా రూ.131 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తం నాలుగు ఎకరాల ఈ భూమి ద్వారా ప్రభుత్వానికి రూ.524 కోట్ల ఆదాయం సమకూరింది.
ఈ వేలంలో ఫ్లాట్ నెంబర్ 20 లోని ఎకరం భూమి కూడా రూ.118 కోట్ల ధర పలికింది. ఈరోజు జరిగిన వేలంలో 8.04 ఎకరాల భూమి ద్వారా హెచ్ఎండీఏకు (HMDA) సుమారు రూ. వెయ్యి కోట్ల ఆదాయం లభించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూమికి ఉన్న అపారమైన డిమాండ్‌కు ఈ ధరలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మొత్తంగా, కోకాపేట నియోపొలిస్‌లో మూడు విడతల్లో వేలం వేసిన ఆరు ప్లాట్లలోని 27 ఎకరాల భూమి ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.3,708 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. హెచ్ఎండీఏ మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు మరియు మూసాపేటలోని 15 ఎకరాలకు సంబంధించిన ఈ-వేలం డిసెంబర్ 5న నిర్వహించనున్నారు.









