పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తనను సవాల్ చేసే ప్రయత్నం చేయవద్దని బీజేపీకి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Integrated Revision)కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనతో రాజకీయంగా పోరాడే శక్తి బీజేపీకి లేదని, పశ్చిమ బెంగాల్‌లో తనను ఓడించడం ఆ పార్టీకి అసాధ్యమని స్పష్టం చేశారు.
బెంగాల్‌లో తమకు సవాల్ విసిరేందుకు ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులను కదిలిస్తానని మమతా బెనర్జీ హెచ్చరించారు. అలాగే, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అది బీజేపీ కమిషన్‌గా మారిందని ఆమె ఆరోపించారు. ఎస్ఐఆర్ కారణంగానే బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చాయని అభిప్రాయపడ్డారు. బీహార్‌లో బీజేపీ వ్యూహాలను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని కూడా వ్యాఖ్యానించారు.
అక్రమంగా దేశంలో ఉంటున్న బంగ్లాదేశీయులను తొలగించడమే SIR లక్ష్యమైతే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఎందుకు చేపట్టడం లేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో కూడా చొరబాటుదారులు ఉన్నట్లు వారు అంగీకరిస్తున్నారా అని నిలదీశారు. బెంగాల్‌లో SIR అనంతరం ముసాయిదా ఓటరు జాబితా వెలువడ్డాక బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలే గుర్తిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.









