భారతీయ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, అమెరికా నుంచి సుమారు $9.3 కోట్ల (రూ. 825 కోట్లు) విలువైన ఆయుధాల విక్రయానికి ఆమోదం లభించింది. ఈ ఆయుధ సామాగ్రి జాబితాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్షిపణి వ్యవస్థ ఎఫ్‌జీఎం-148 జావెలిన్ మిస్సైల్ ఒకటి. ఇది ఒక మనిషి మోయగలిగే (Man-Portable) అత్యాధునిక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ATGM). రష్యాతో పోరులో యుక్రెయిన్‌కు ఈ ఆయుధం దేవదూతలా పనిచేసి, వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనికి విపరీతమైన క్రేజ్ లభించింది.
జావెలిన్ క్షిపణిని అమెరికాకు చెందిన రేథియాన్ మరియు లాక్హిడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే, క్షిపణిని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ లేదా వేడి వెలువడదు. దీనిని ఒక ట్యూబ్ నుంచి మొదట ఓ మోటార్ కొంత దూరం విసురుతుంది, ఆ తర్వాతే క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఈ పద్ధతి వల్ల శత్రువులు హీట్ సెన్సర్లతో ప్రయోగించిన ప్రదేశాన్ని కనుగొనడం కష్టం అవుతుంది. ఈ లోపు ప్రయోగించిన సైనికులు సురక్షిత ప్రాంతానికి చేరుకోవచ్చు. దీనిని కంప్యూటర్‌తో నియంత్రించడం వల్ల లక్ష్యంపై కచ్చితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ క్షిపణి రెండు రకాల దాడి (Attack) మోడ్‌లను కలిగి ఉంది. మొదటిది, టాప్ ఎటాక్ మోడ్, దీనిలో క్షిపణి నింగిలోకి దాదాపు 500 అడుగుల ఎత్తు వరకూ పైకిలేచి, శత్రు ట్యాంకు యొక్క పైభాగంపైకి (Upper side) దూసుకొస్తుంది. ట్యాంకులో ఈ భాగంలో కవచం అంత పటిష్ఠంగా ఉండదు కాబట్టి, ట్యాంకును సులభంగా ధ్వంసం చేయగలదు. రెండోది, డైరెక్ట్ ఎటాక్ ఆప్షన్, దీనిలో క్షిపణి సూటిగా వెళ్లి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మోడ్ బంకర్లు, భవనాలు, లేదా ఇతర సైనిక వాహనాలను ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది. క్షిపణిలో ఉండే రెండు పేలుడు పదార్థాలు (Two Explosive Charges) ట్యాంకుల యొక్క రియాక్టివ్ కవచాలను కూడా ఛేదించగలవు.








