AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనం నవంబర్ 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత నవంబర్ 24 నాటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాతావరణ మార్పుల కారణంగా నవంబర్ 27 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ తుఫాను ప్రభావంతో నవంబర్ 27 వరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు.

ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వరి పంట కోతల సమయం దగ్గర ఉన్నందున ధాన్యాన్ని ముందుగా భద్రపరుచుకోవాలని సూచించారు. అలాగే, తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీయనున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ANN TOP 10