AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణపై బీజేపీ ఫోకస్: ‘ఒడిశా ఫార్ములా’ అమలుకు ప్లాన్

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత, బీజేపీ కేంద్ర నాయకత్వం దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తెలంగాణపై దృష్టి సారించింది. దక్షిణాదిలో బలహీనంగా ఉన్నందున, తెలంగాణను తమ విజయానికి ‘గేట్ వే’గా మార్చుకోవాలని పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. రానున్న కాలంలో కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణలో పర్యటిస్తూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరో మూడేళ్ల సమయం ఎన్నికలకు ఉండటంతో, నాయకుల పర్యటనలతో తెలంగాణను హోరెత్తించనున్నారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఇక్కడ ‘ఒడిశా ఫార్ములా’ను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒడిశాలో తొలుత కాంగ్రెస్‌ను బలహీనపర్చిన తర్వాత, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే, తెలంగాణలో మాత్రం ఈ ఫార్ములాను రివర్స్‌లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రెండుసార్లు అధికారాన్ని పొందిన ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ను తొలుత బలహీనం చేసిన తర్వాత, ప్రస్తుతం అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి అధికారాన్ని వేరు చేయాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఎనిమిది స్థానాలు దక్కడంతో ఇక్కడ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. దేశంలో కర్ణాటక, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాలే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. వీటిని కూడా తమ చేతికి అందుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా, తెలంగాణలో మాత్రం పార్టీ నాయకత్వంతో పాటు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. రానున్న కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కూడా మంజూరయ్యే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పడం విశేషం.

ANN TOP 10