AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేసి చూపించాం: సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను విజయవంతంగా అమలు చేసి చూపించామని అన్నారు. ఈ హామీలు అమలు సాధ్యం కావని కొందరు తమను గేలి చేశారని గుర్తు చేస్తూ, కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే అన్ని హామీలను అమలు చేసి చూపించామని స్పష్టం చేశారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో జరిగిన సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుఖీభవ’ నగదును జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకూ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లలో కలిపి పదివేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా, వ్యవసాయంలో కూడా మార్పులు రావాలని, లాభసాటిగా సేద్యం జరగాలంటే సాగు తీరు మారాలని సూచించారు. ప్రకృతి సేద్యంలో ఎవరు ముందుంటే వారికే భవిష్యత్ ఉంటుందని రైతాంగానికి తెలిపారు.

అంతకుముందు, కడపలో నిర్వహించిన మహానాడును సూపర్ సక్సెస్ చేశారని గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ప్రజలు ఉన్నారని చంద్రబాబు అన్నారు. గతంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు, తద్వారా కేంద్రంతో సత్సంబంధాల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని పరోక్షంగా తెలిపారు.

ANN TOP 10