బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ప్రతి ఈవీఎంలో 25 వేల ఓట్లు పడ్డాయని ఆర్జేడీ సీనియర్ నేత జగదానంద సింగ్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. జగదానంద సింగ్ ఆరోపణలను ఈసీ గట్టిగా ఖండిస్తూ, ఇది సాంకేతికంగా అసాధ్యమని స్పష్టం చేసింది. ఈవీఎంలలో బ్లూటూత్, ఇంటర్నెట్ లేదా ఇతర కనెక్షన్లు ఏవీ ఉండవని, కాబట్టి బయటి నుంచి వాటిని యాక్సెస్ చేయడం లేదా డిజిటల్ ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఈసీ తెలిపింది.
పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రతి ఈవీఎంలో సున్నా (Zero) ఓట్లు ఉంటాయని ఎన్నికల సంఘం వివరించింది. అంతేకాకుండా, పోలింగ్‌కు ముందు అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే మాక్ పోలింగ్ నిర్వహిస్తారని, ఆ తర్వాత ఆ ఓట్లను కూడా తొలగిస్తారని వెల్లడించింది. ఈవీఎంలను కేటాయించే ప్రక్రియ కూడా ర్యాండమ్‌గా ఉంటుందని, ఏ యంత్రం ఏ పోలింగ్ కేంద్రానికి వెళుతుందో ఎవరూ ముందుగా తెలుసుకోలేరని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ పార్టీల ఏజెంట్లు పాల్గొంటారని, ఈ ఆరోపణలు నిబంధనలకు విరుద్ధమని ఈసీ తేల్చి చెప్పింది.
ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆర్జేడీ పేర్కొన్నప్పటికీ, రెండు విడతల పోలింగ్ సమయంలో ఆ పార్టీ ఒక్కసారి కూడా అభ్యంతరాలు చెప్పలేదని ఎన్నికల సంఘం తెలిపింది. అంతేకాకుండా, జగదానంద సింగ్ తమ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని ఈసీ వెల్లడించింది. మాక్ పోల్ సర్టిఫికెట్లు, ఫామ్ 17సీ, ఇతర పత్రాలపై ఆర్జేడీ సొంత ఏజెంట్లు సంతకం చేసినప్పటికీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోపణలు చేయడం సరికాదని ఎన్నికల సంఘం పేర్కొంది.








