ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టు నుంచి విడుదల చేస్తూ (రిలీజ్) సంచలన నిర్ణయం తీసుకోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం తొలిసారిగా స్పందించింది. 12 ఏళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన జడేజాను వదిలిపెట్టడం “నిజంగా కఠినమైన నిర్ణయమే” అని CSK సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. అయితే, జట్టు భవిష్యత్తు దృష్ట్యా, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ ట్రేడ్ జరగడానికి ముందు జట్టులోని ఆటగాళ్లతో చర్చించామని, అందరి సమ్మతితోనే ఇది జరిగిందని ఆయన పేర్కొన్నారు.
సీఎస్కే యాజమాన్యం జడేజాను వదులుకుని, రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను ట్రేడ్ ద్వారా సొంతం చేసుకుంది. ఈ నిర్ణయానికి గల కారణాన్ని సీఈవో వివరిస్తూ, జట్టుకు టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాటర్ అవసరం ఉందని, అయితే మినీ వేలంలో ఎక్కువ మంది భారత బ్యాటర్లు లేకపోవడంతో ట్రేడ్ ద్వారా సొంతం చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. “సీఎస్కేకు సంజూ శాంసన్ లాంటి ప్లేయర్ అవసరం ఉంది. సంజూ శాంసన్‌కు ఐపీఎల్లో చాలా అనుభవం ఉంది, అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గానూ ఉన్నాడు” అని ఆయన వివరించారు.
రవీంద్ర జడేజాను వదిలేయడంపై సీఎస్కే అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కాశీ విశ్వనాథన్ ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. జడేజా కూడా సానుకూలంగానే స్పందించారని తెలిపారు. అలాగే, సామ్ కరన్‌ను వదులుకోవడం కూడా కఠిన నిర్ణయమేనని పేర్కొంటూ, “వీరు తమ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్కే భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. భారత బ్యాటర్‌ను పొందడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకలేదు” అని సీఈవో స్పష్టం చేశారు.









