తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీటుకు జరుగుతున్న ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యన ఉంది.
ఈసారి ఎన్నికల్లో భద్రతా పర్యవేక్షణ కోసం అధికారులు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఏకంగా 139 పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేయనున్నారు. ప్రతి డ్రోన్ నుంచి వచ్చే లైవ్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్‌లో పరిశీలిస్తారు. డ్రోన్లతో పాటు పారామిలిటరీ బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, మొబైల్ టీమ్స్ సహా మొత్తం 1,761 మంది పోలీసులు, ఎనిమిది కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం నవంబర్ 11 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన నిషేధం విధించింది. ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, బీఆర్ఎస్, బీజేపీలకు రాష్ట్ర రాజకీయాల్లో తమ బలాన్ని పరీక్షించుకునేందుకు ఒక పెద్ద పరీక్షగా మారింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.









