ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో నిరసనల సెగ తగిలింది. శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోట వినుత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని, జనసేన కార్యకర్త అయిన రాయుడు హత్య కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. రాయుడు చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ, పార్టీ నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
డ్రైవర్ రాయుడు హత్య కేసు నాలుగు నెలల కింద తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. రాయుడు మృతదేహం జులై నెలలో చెన్నై సమీపంలోని కూపం నది ఒడ్డున లభించింది. ఈ కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు సహా మరికొందరిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. కోట వినుతపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ ఆమెను శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించింది. జైలులో ఉన్న కోట వినుత కొద్ది రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.
ఈ కేసు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, చనిపోయిన రాయుడు సెల్ఫీ వీడియో ఇటీవల బయటకు వచ్చింది, దీనికి ప్రతిగా కోట వినుత కూడా తనపై జరుగుతున్న కుట్రలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడతానంటూ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. రాయుడు కుటుంబసభ్యులు మాత్రం కోట వినుతపై ఆరోపణలు చేస్తూ, తమ అభిమాని అయిన డ్రైవర్‌కు న్యాయం జరగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కోరుతున్నారు.









