బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఓటు వేసిన లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్)కి చెందిన ఎంపీ శాంభవి చౌదరి, రెండు వేళ్లకు సిరా గుర్తుతో కనిపించడం వివాదానికి దారితీసింది. ఓటు వేసిన తర్వాత తన కుటుంబంతో కలిసి మీడియా ముందుకు వచ్చిన శాంభవి చౌదరి, ముందుగా కుడి చేతికి ఉన్న సిరా గుర్తును చూపించారు. అనంతరం ఆమె తండ్రి సంజ్ఞ చేయడంతో ఎడమ చేతి వేలికి ఉన్న సిరా గుర్తును కూడా చూపించడంతో, ఆమె రెండుసార్లు ఓటు వేశారనే విమర్శలు, ఆరోపణలు రావడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వ్యవహారంపై ఆర్జేడీ వంటి పార్టీలు “ఇది వేరే స్థాయి మోసం” అని ప్రశ్నించాయి. దీంతో, ఈ అంశం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ కావడంతో పాట్నా జిల్లా అధికారులు వెంటనే స్పందించారు. ఇది పోలింగ్ సిబ్బంది కారణంగా జరిగిన మానవ తప్పిదం మాత్రమేనని జిల్లా యంత్రాంగం వివరణ ఇచ్చింది. పోలింగ్ సిబ్బందిలో ఒకరు పొరపాటున కుడిచేతి వేలికి ఇంక్ వేశారని, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారి జోక్యంతో ఎడమ చేతి వేలికి కూడా సిరా గుర్తు వేశారని విచారణలో తేలినట్లు అధికారులు స్పష్టం చేశారు.
అధికారులు ఎంపీ ఓటు వేసిన కేంద్రం మరియు ఆమె సీరియల్ నెంబర్ వివరాలను కూడా వెల్లడించి, ఆమె ఒకేసారి ఓటు వేశారని ధృవీకరించారు. దీనిపై ఎంపీ శాంభవి చౌదరి కూడా స్పందిస్తూ, ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమేనని, దీనిని వివాదం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో సిరా గుర్తు రెండు వేళ్లకు పడటం వెనుక ఉన్న వాస్తవాన్ని అధికారులు వివరించడం ద్వారా, ఆమె రెండుసార్లు ఓటు వేశారనే విమర్శలకు ముగింపు పలికారు.









