భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని ఆయన చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అవార్డులు అందుకోవడంతో పాటు, గత నెలలో వీనూ మాంకడ్ ట్రోఫీలో కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక పెద్ద అవకాశం దక్కించుకున్నాడు. బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో అన్వయ్ చోటు దక్కించుకున్నాడు.
రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌ను ఈ టోర్నమెంట్‌లో టీమ్ C తరపున ఆడేందుకు ఎంపిక చేశారు. ఈ యువ ఆటగాడు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్‌గా దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో పేరుగాంచారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 5 నుండి 11, 2025 వరకు హైదరాబాద్‌లో జరుగుతుంది. అన్వయ్ ద్రవిడ్‌కు ఇది తన ప్రతిభను ప్రదర్శించి, క్రికెట్ కెరీర్‌లో మరింత ఎదగడానికి ఒక ముఖ్యమైన వేదిక కానుంది.
టీమ్ C కెప్టెన్‌గా ఏరాన్ జార్జ్ వ్యవహరించనుండగా, టీమ్ C మొదటి మ్యాచ్ శుక్రవారం వేదాంత్ త్రివేది నాయకత్వంలోని టీమ్ Bతో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అన్వయ్ ద్రవిడ్ ఆడే అవకాశం ఉంది. రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా బ్యాట్స్‌మెన్ కావడం గమనార్హం.









