భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ తాజాగా చేసిన ఒక పని సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్-ఏ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్, విరాట్ కోహ్లీకి సంబంధించిన జెర్సీ నంబర్ 18 ధరించాడు. టెస్టు క్రికెట్‌కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, దేశానికి ఆయన చేసిన సేవకు గుర్తుగా ఆ జెర్సీ నంబర్‌ను మరెవరికీ కేటాయించకుండా గౌరవించాలని కోహ్లీ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, కోహ్లీని అవమానించే విధంగా పంత్‌కు ఆ నంబర్‌ను కేటాయించారని, ఇది ముమ్మాటికీ కోహ్లీని అగౌరవపరచడమేనని అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ నెట్టింట రచ్చ చేశారు.
కొంతమంది అభిమానులు రిషబ్ పంత్‌ను ఉద్దేశపూర్వకంగా ఆ జెర్సీ నంబర్ ధరించాడని అనుమానించారు. మరికొందరు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టిలో పడటం కోసమే పంత్ ఇలా చేశాడా? అంటూ నెట్టింట పోస్టులు, కామెంట్లు చేశారు. దీంతో పరిస్థితి కాసేపు పంత్ వర్సెస్ కోహ్లీ అభిమానుల మధ్య వివాదంలా మారింది. టెస్టు క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన కోహ్లీకి సంబంధించిన జెర్సీ నంబర్ 18 ఎవరికీ కేటాయించకుండా గౌరవంగా చూడాల్సి ఉండగా, బీసీసీఐ తీరుపై కూడా ఫ్యాన్స్ మండిపడ్డారు.
వివాదం తీవ్రం కావడంతో, బీసీసీఐ వర్గాలు ఈ అంశంపై వివరణ ఇచ్చాయి. “భారత్-ఏ జట్టులో జెర్సీ నంబర్లు ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించరు. వాటిపై పేర్లు కూడా ఉండవు. మ్యాచ్‌కు ముందు వచ్చిన జెర్సీలను ఆటగాళ్లు ధరించారు. తప్ప భారత్-ఏలో జెర్సీ నంబర్లకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదు” అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివరణతోనైనా కోహ్లీ అభిమానులు శాంతిస్తారో లేదో చూడాలి.









