AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకారం అందించండి: ఆస్ట్రేలియా యూనివర్సిటీకి మంత్రి లోకేష్ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వాకల్చర్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు జరిపారు. ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టయినబుల్ ట్రోఫికల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ (CSTFA) విభాగం ప్రొఫెసర్ క్యాల్ జెంజర్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఉష్ణమండల ఆక్వాసాగులో ముఖ్యమైన బ్లాక్ టైగర్, బారాముండి రకాల రొయ్యల జన్యుపరమైన మెరుగుదల పరిశోధనలకు నాయకత్వం వహించడంలో ప్రసిద్ధులైన ప్రొఫెసర్ జెంజర్‌తో ఆక్వాసాగు సామర్థ్యాన్ని పెంచే అత్యాధునిక జన్యుసంబంధ సాధనాల అభివృద్ధిపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు, చేపల పెంపకం సామర్థ్యాన్ని పెంపొందించేందుకు CSTFA ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను రాష్ట్ర రైతులకు అందించాలని కోరారు. ముఖ్యంగా, భారత్‌లో ఉత్పత్తి అయ్యే బ్లాక్ టైగర్ రొయ్యలలో వ్యాధి నిరోధకత, వృద్ధిరేటును పెంచడానికి జన్యుపరమైన మెరుగుదలకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి వాటర్ రీసైక్లింగ్, ఫీడ్ ఆప్టిమైజేషన్ వంటి స్థిరమైన నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.

అంతేకాక, ఏపీ ఆక్వా రైతుల కోసం ఆధునిక సాగు పద్ధతులు, జన్యుపరమైన ఎంపిక, స్థిరమైన నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, ఎంపిక చేసిన బ్రీడ్‌ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు CSTFA అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అందించాలని కోరారు. ఆక్వాసాగులో నష్టాలను తగ్గించి ఉత్పత్తిని స్థిరీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కూడా మంత్రి లోకేష్ ప్రొఫెసర్ జెంజర్‌ను కోరారు. ఈ భేటీ ద్వారా ఏపీ ఆక్వాకల్చర్ రంగం నాణ్యత, ఉత్పాదకతను పెంచడానికి అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను వినియోగించుకోవడానికి మార్గం సుగమమైంది.

ANN TOP 10