భారతీయ రైల్వే (Indian Railways) ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే తెల్లటి బెడ్ షీట్ల స్థానంలో కొత్త దుప్పట్లను అందుబాటులోకి తెస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాణికుల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లటి బెడ్ షీట్లపై మరకలు అంటితే తొందరగా పోకపోవడం, వాటిని కేవలం నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే శుభ్రం చేయడం వల్ల అవి మురికిగా ఉంటున్నాయని, దీనివల్ల పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయని రైల్వే గుర్తించింది. అంతేకాక, తెల్లటి దుప్పట్లు చూసేందుకు ఆసుపత్రిని గుర్తు చేస్తున్నాయనే కొంతమంది ప్రయాణికుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఇకపై ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు తెల్లటి దుప్పట్ల బదులుగా కాటన్ క్లాత్‌తో చేసిన డిజైన్లు ఉన్న ప్రింటెడ్ దుప్పట్లను అందిస్తారు. ఈ దుప్పట్లు సాంస్కృతికమైన ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ మార్పును పైలెట్ ప్రాజెక్టుగా జైపూర్‌లో ప్రారంభించారు. మొదటగా జైపూర్ – అసర్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో వీటిని అందించారు. విజయవంతమైతే, త్వరలోనే దేశంలోని అన్ని రైళ్లకు ఈ కొత్త దుప్పట్లను విస్తరించనున్నారు.
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అందించిన దుప్పట్లపై ఉండే బ్లాక్ ప్రింటింగ్ జైపూర్ సమీపంలోని ఒక చిన్న పట్టణం అయిన సంగనేరి ప్రాంతానికి చెందింది. ఈ ప్రాంతం శతాబ్దాలుగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్కు ప్రసిద్ధి చెందింది. పూల నమూనాలు, గీతలు వంటి వాటితో ఈ దుప్పట్లు అందంగా కనిపిస్తాయి. దీని ద్వారా భారతీయ రైల్వే సంస్కృతి, సంప్రదాయాలకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశాన్ని కూడా చాటుతోంది.









