AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కేసీఆర్ రంగంలోకి, రేవంత్ రెడ్డితో రసవత్తర పోరు ఖాయం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారనుంది. బిఆర్ఎస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే.సి.ఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) పేరును అధికారికంగా ప్రకటించింది. దీంతో కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొనడం ఖాయమైంది. ఈ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న బిఆర్ఎస్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా బరిలోకి దింపింది. కేసీఆర్ ప్రచారం, మాగంటి కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పట్టు, సానుభూతి తమకు కలిసివస్తాయని బిఆర్ఎస్ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి.

అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, జూబ్లీహిల్స్ రాజకీయాల్లో పట్టున్న నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ప్రచారంలోకి దిగనుండడంతో ఈ ఉప ఎన్నిక కేవలం కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ స్థాయి నుండి ‘కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి’ స్థాయికి చేరుకోనుంది. వీరిద్దరూ జూబ్లీహిల్స్‌లో ఒకటి రెండు భారీ సభల్లో పాల్గొనే అవకాశం ఉండటంతో, ఈ పోరు తెలంగాణ రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బిఆర్ఎస్ తరపున కేసీఆర్‌తో పాటు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మొత్తం 40 మంది కీలక నాయకులతో కూడిన స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. మరోవైపు, బిజెపి కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ప్రకటించింది. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. బిజెపి తరపున కూడా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక త్రిముఖ పోటీగా ఉత్కంఠను రేపుతోంది.

ANN TOP 10