AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు: భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందంటూ హింట్

టాలీవుడ్ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా ఇష్టమని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. పిల్లలు ఆద్యా, అకీరా నందన్ పెద్దవాళ్లయిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం పట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆమె పరోక్షంగా సూచించారు. సన్యాసంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు, రెండో పెళ్లి గురించి గతంలో చర్చించిన సందర్భాల నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు ఆమె అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో తనపై వచ్చిన విమర్శలపై కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. “నేను ‘టైగర్ నాగేశ్వరరావు’ చేయగానే మళ్లీ సినిమాల్లోకి వచ్చింది, ఇక ఎక్కడ చూసినా కనిపిస్తుంది అని విమర్శలు రాశారు. కానీ, ఆ సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నా నేను మరే సినిమాలోనూ నటించలేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు చేసినవారు ఇప్పుడు క్షమాపణలు చెప్పరని, మాట్లాడేవారు ఎలాగైనా మాట్లాడతారని అన్నారు.

అయితే, నటన అంటే తనకు చాలా ఇష్టమని, కానీ అదే తన జీవిత లక్ష్యం కాదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. తాను డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిలా కనిపించవచ్చు కానీ, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వనని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు మంచి పాత్రలు, మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు వస్తున్నాయని తెలిపారు. త్వరలోనే అత్తా-కొడళ్ల నేపథ్యంలోని ఒక కామెడీ సినిమాలో అత్త పాత్రలో నటించేందుకు ఆమె అంగీకరించినట్లు వెల్లడించారు. నటనతో పాటు, ఆమె తన సామాజిక సేవ, జంతు సంరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.

ANN TOP 10