గర్ల్‌ఫ్రెండ్‌ను తన హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ఓ యువకుడు తెగించాడు. ఆమెను సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి తీసుకెళ్లాలని చూశాడు. కానీ, చెకింగ్‌లో సెక్యూరిటీకి దొరికిపోయాడు. హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఒక విద్యార్థి తన లవర్‌ను బాలుర హాస్టల్‌లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దానికోసం అతడు ఒక పెద్ద సూట్‌కేస్‌ను తీసుకున్నాడు. అందులో ఆ అమ్మాయిని ప్యాక్ చేశాడు. అనంతరం అదే సూట్‌కేస్‌తో హాస్టల్‌లోకి ప్రవేశించాడు. అయితే, హాస్టల్ గార్డులకు విద్యార్థిపై అనుమానం రావడంతో ఆపి, లగేజ్ చెక్ చేశారు. ఈ క్రమంలో ఆ సూట్‌కేస్‌ను తెరవగా లోపల అమ్మాయి కనిపించడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే సూట్‌కేస్‌లోంచి ఆ అమ్మాయిని బయటకు తీశారు.
ఆ సమయంలో తోటి విద్యార్థులు ఈ సంఘటనను వీడియో తీశారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. కాగా, ఈ సంఘటనపై విశ్వవిద్యాలయం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. ఆ విద్యార్థిపై ఏదైనా చర్య తీసుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.