జమిలి ఎన్నికల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. ఒకే దేశం – ఒకే ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని అన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేక పోతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయించడం ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం సరికాదని వ్యాఖ్యానించారు.