అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రం సమయంలో అల్లు అర్జున్ ఇంటి ఆవరణకు వెళ్లి ఓయూ జేఏసీ నిరసనలు తెలిపింది. అంతటితో ఆగకుండా జేఏసీ నేతలు ఇంటిపైకి రాళ్లు, టమాటాలు విసిరారు. ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. కాంపౌండ్ వాల్ ఎక్కి ఆందోళనలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై సోషల్‌మీడియాలో కూడా పెద్దగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ కీలక సూచనలు చేశారు. తన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని సూచించారు. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని నా ఫ్యాన్స్‌కు సూచించారు.