తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారాయి. సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. లగచర్ల రైతుకు బేడీలేసి ఆస్పత్రికి తీసుకురావటంపై సభలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్ నేతలు పట్టుబట్టారు. కానీ.. ప్రభుత్వం చర్చ చేపట్టకపోవటంతో.. బీఆర్‌ఎస్ నేతలు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై మంగళవారం ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నల్ల చొక్కాలు, చేతులకు బేడీలతో అసెంబ్లీకి వచ్చిన నేతులు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయటం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.
సభ నుంచి వాకౌట్..
లగచర్ల ఘటనపై అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ నేతలు నిరసనలు, నినాదాలతో హోరెత్తించింది. రాష్ట్రంలో పర్యాటక విధానం అనే అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా లేచి.. లగచర్ల రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ ఎంతకూ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ.. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు..
దీంతో.. అక్రమ కేసులు, చిత్రహింసలకు గురవుతున్న లగచర్ల రైతులకు మద్దతుగా.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జైళ్లలో అక్రమంగా నిర్బంధించటమే కాకుండా.. అనారోగ్యంగా ఉందని తెలిసి కూడా చేతులకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకొచ్చిన అమానవీయ ఘటనలను నిలదీయాలన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు.. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తూ.. లగచర్ల రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
జరిగింది ఇదీ..
లగచర్ల ఘటనలో అరెస్టయిన రైతులను సంగారెడ్డి జైలులో ఉంచగా.. అందులో హీర్యా నాయక్ అనే రైతుకు గుండెల్లో నొప్పి రావటంతో.. వెంటనే స్పందించిన జైలు అధికారులు అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ.. ఆ రైతును పోలీసుల జీపులోనే.. చేతులకు బేడీలు, గొలుసులు వేసి తీసుకురావటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జైలు అధికారులపై వేటు కూడా పడింది.
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం.. లూటీ రాజ్యం, రైతులకు బేడీల సిగ్గు సిగ్గు.
లగచర్ల పేద గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ, చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. pic.twitter.com/F3gunnF9Ob
— BRS Party (@BRSparty) December 17, 2024