4కోట్ల ప్రజలను ఏకం చేసి నడిపించింది..
తెలంగాణ తల్లిపై వివాదం వద్దు
హాట్‌హాట్‌గా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు షురూ..
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు షురూ అయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తల్లిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు. ఏ తల్లికి కిరీటం ఉండదు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది.. ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని. తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా. ఈ విషయాన్ని జనాలకు వివరించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
అధికారికంగా గుర్తింపు ఏదీ?
అసెంబ్లీలో తెలంగాణ తల్లిపై చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన చేశారు.‘సంస్కృతికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి. 4కోట్ల ప్రజలను ఏకం చేసి నడిపించిన తల్లి తెలంగాణ తల్లి. అలాంటి తల్లి రూపాలు ఇప్పటికే జన బాహుళ్యంలో ఉన్నాయి. వాటికి ఇప్పటికీ అధికారికంగా గుర్తింపు లేదు. మన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టి పడేలా తెలంగాణ తల్లిని రూపొందించాం. చరిత్రకు దర్పంగా పీఠాన్ని రూపొందించాం. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
నా తెలంగాణ.. కోటి రత్నాల వీణ
‘‘డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల పర్వదినం. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ నెరవేర్చారు. ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. నా తెలంగాణ.. కోటి రత్నాల వీణ అన్న దాశరథి మాటలు నిత్యసత్యం. భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతి అస్తిత్వమే. అస్తిత్వానికి మూలం సంస్కృతి. సంస్కృతికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి. జాతి భావనకు జీవం పోసింది తెలంగాణ తల్లి. నిరంతరం చైతన్యపరిచి లక్ష్యసాధనవైపు నడిపింది తెలంగాణ తల్లి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు
‘‘తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాలు పోరాటం చేసింది. ఓయూ, కేయూ కీలక భూమిక పోషించాయి. సామాజిక బాధ్యతతో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. శ్రీకాంతాచారి వంటి చాలా మంది విద్యార్థులు అమరులయ్యారు. ఉద్యమాన్ని గౌరవించి డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర గీతం, విగ్రహం విషయంలో అధికారిక నిర్ణయం తీసుకోలేదు. సంస్కతికి ప్రతిరూపమే తల్లి. 4కోట్ల ప్రజలను ఏకం చేసి నడిపించిన తల్లి తెలంగాణ తల్లి. అలాంటి తల్లి రూపాలు ఇప్పటికే జన బాహుళ్యంలో ఉన్నాయి. వాటికి ఇప్పటికీ అధికారికంగా గుర్తింపు లేదు. మన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టి పడేలా తెలంగాణ తల్లిని రూపొందించాం. చరిత్రకు దర్పంగా పీఠాన్ని రూపొందించాం. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నాం. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
రాజకీయాలు పక్కన పెడదాం
‘‘తెలంగాణ ప్రతిరూపమే అధికారికంగా లేదు. అందరితో చర్చించి తెలంగాణ తల్లి రూపంపై నిర్ణయం తీసుకున్నాం. దేవతలా ఉండాలా లేక మన ఇంట్లో తల్లిలా ఉండాలా అనే చర్చ జరిగింది. తల్లి ప్రతి రూపమే పెట్టుకోవాలనే అభిప్రాయం వచ్చింది. అందుకే ఈ రోజు బహుజన తల్లిని ఆవిష్కరిస్తున్నాం. కొందరికి ఇది నచ్చలేదు. ఒక కుటంబం, ఒక వ్యక్తి తెలంగాణ అనే భావన మంచిది కాదు. ఈ ఒక్క రోజు రాజకీయాలు పక్కన పెడదాం. రేపటి నుంచి రాజకీయ అంశాలు ప్రస్తావిద్దాం. సోమవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అధినేత,. మాజీ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కమ్యూనిస్టు నేతలను ఆహ్వానించాం. అందరూ విగ్రహావిష్కరణకు హాజరు కావాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.