AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోహన్‌బాబు ఇంటి వద్ద హై టెన్షన్‌.. పోటాపోటీగా బౌన్సర్ల మోహరింపు

హుటాహుటిన దుబాయ్‌ నుంచి మంచు విష్ణు రాక
ముంబై నుంచి చేరుకున్న మంచు లక్ష్మి!
మనోజ్‌ ఒంటిపై అనుమానాస్పద గాయాలంటూ డాక్టర్లు వెల్లడి

జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద హైటెన్షన్‌ నెలకొంది. సోమవారం ఉదయం నుంచి ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్‌ తెప్పించారు. మనోజ్‌ తరఫు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించ లేదు. మరోవైపు హుటాహుటిన దుబాయ్‌ నుంచి మంచు విష్ణు వచ్చారు.

సినీ నటుడు మంచు మోహన్‌ బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు.. అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీ షరీఫ్‌ పరిధిలోని మోహన్‌ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్‌బాబు అనుచరులు వినయ్‌ ఇతర బౌన్సర్లు మనోజ్‌పై, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు.. గాయాలతోనే మనోజ్‌ తన భార్యతో కలసి పహాడీ షరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

మీడియాకు మనోజ్‌ దూరం..
ఈ విషయమై మహేశ్వరం డీసీపీని సంప్రదించగా డయల్‌–100కు కాల్‌ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కాలుకు గాయం అయిన మంచు మనోజ్‌ తన భార్య మౌనికతో కలసి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మనోజ్, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు.

జల్‌పల్లిలో పోటాపోటీగా బౌన్సర్లు..
అయితే.. జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. మనోజ్‌ తరఫు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించ లేదని సమాచారం. దుబాయ్‌ నుంచి మంచు విష్ణు వచ్చారు. పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో మరోవైపు ముంబై నుంచి మంచు లక్ష్మి వచ్చినట్లు సమాచారం.

మనోజ్‌ ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు
మనోజ్‌ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. మనోజ్‌కు ఎంఎల్‌సీ (మెడికో లీగల్‌ కేసు) పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారని తెలిసింది. సిటీ స్కాన్‌, ఆల్ట్రా సౌండ్‌ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలని సూచించగా.. సోమవారం మరోసారి ఆస్పత్రికి వస్తానని మనోజ్‌ డిశ్చార్జి అయినట్లు సమాచారం.

ANN TOP 10