తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. సభలో ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వంప్రవేశ పెట్టనుంది.
గవర్నర్ ఆమోదం ..
ఈనెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దాంతో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులను జారీ చేశారు. అసెంబ్లీతో పాటే శాసన మండలి సమావేశాలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 9న ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గతంలో ఇద్దరు వరకు సంతానం ఉన్న వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీనిని సవరించి ముగ్గురి సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించబోతోంది.
సభ ముందుకు ఐదు ఆర్డినెన్సులు…
రేపు శాసన సభ ముందుకు ఐదు ఆర్డినెన్సులు, రెండు వార్షిక నివేదికలు రానున్నాయి. తెలంగాణ జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్సును సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (సవరణ) ఆర్డినెన్సు 2024ను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్సు 2024ను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ వస్తువుల, సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్సు 2024ను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్సు 2024ను సభలో మంత్రి సీతక్క ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక 2022-23 ప్రతిని సభకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివేదించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక 2021-22 ప్రతిని సభకు మంత్రి కొండా సురేఖ నివేదించనున్నారు.