ఆకాశం హోరెత్తింది. ఎటు చూసినా అద్భుత దృశ్యాలే. ట్యాంక్ బండ్ వద్ద ఇసుకవేస్తే రాలనంత జనసమూహం. అదే స్థాయిలో ఎటు తలతిప్పినా ఆకాశంలో విమానాలు. వాటి విన్యాసాలు తిలకించిన ప్రజలు ఆశ్చర్యకితులయ్యారు. భారత్ మాతాకీ జై.. అంటూ నినదిస్తూ.. ప్రజాపాలన విజయోత్సవాలకు స్పెషల్ ఎయిర్ షో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్ కు అభినందనలు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి విజయోత్సవ బహిరంగ సభలలో పాల్గొన్నారు. అయితే నిన్నటి నుండి ప్రజా పాలన ప్రజా విజయోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఆదివారం ప్రత్యేక ఎయిర్ షో నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరధి ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం హుస్సేన్ సాగర్ పైనుండి ఎయిర్ షో నిర్వహించింది. 9 విమానాలు ఎయిర్ షోలో పాల్గొనగా, ఆ అద్భుత విన్యాసాలను ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వీక్షించారు. అసలే ఆదివారం సెలవు దినం కావడంతో ట్యాంకు బండి పరిసరాలు జనసంద్రంతో నిండిపోయాయి. త్రివర్ణ పతాకం కలర్ లో ప్రదర్శనలు సాగగా, ప్రజలు జయహో అంటూ నినదించారు.
ఎయిర్ షో వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
ట్యాంక్ బండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ షోను సీఎం రేవంత్ రెడ్డి వీక్షించారు. సీఎం తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఎయిర్ షో వీక్షణకు వచ్చిన ప్రజలు సీఎం ను చూసి, సీఎం సార్ థ్యాంక్యూ సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముందుగా ఎయిర్ షో లో పాల్గొంటున్న సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీంను సీఎం అభినందించారు.